టెక్ దిగ్గజం గూగుల్ కి చెందిన సోషల్ మీడియా సైట్ గూగుల్ ప్లస్ మూతపడనుంది. సాఫ్ట్వేర్ పరమైన సాంకేతిక లోపాలతో యూజర్ల డేటా ఇతరుల చేతికి చేరే అవకాశాలుండటమే ఇందుకు కారణం. ఒక బగ్ మూలంగా 5,00,000 మంది యూజర్ల ప్రైవేట్ డేటా బయటి డెవలపర్లకు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఏ డెవలపర్కు కూడా ఈ బగ్ గురించి గానీ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఏపీఐ) దుర్వినియోగం గురించి గానీ తెలుసనడానికి తగిన ఆధారాలేమీ కనిపించలేదని గూగుల్ తెలిపింది. అలాగే ఎవరి ప్రొఫైల్ డేటా కూడా దుర్వినియోగం అయిన దాఖలాలు కూడా కనిపించలేదని గూగుల్ వైస్ ప్రెసి డెంట్ (ఇంజినీరింగ్ విభాగం) బెన్ స్మిత్... ఒక బ్లాగ్లో పేర్కొన్నారు. బగ్గు సరిదిద్దేందుకు జరిగిన ప్రయత్నాల్లో భాగంగా అంతర్గతంగా నిర్వహించిన పరిశీలనలో ఈ అంశాలు వెల్లడైనట్లు ఆయన వివరించారు. అయితే, గూగుల్ ప్లస్ను తక్షణం మూసివేయబోమని, 10 నెలల వ్యవధి ఉంటుందని స్మిత్ తెలిపారు. వచ్చే ఆగస్టు ఆఖరు నాటికల్లా ప్రక్రియ పూర్తి కావొచ్చని పేర్కొన్నారు. ఈ లోగా తమ డేటాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వేరే యాప్స్లోకి పంపించుకోవచ్చు తదితర అంశాల గురించి యూజర్లకు తగు అవగాహన ఇవ్వనున్నట్లు స్మిత్ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
EmoticonEmoticon