*ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే?*
ఒక వ్యక్తి కానీ, ఓ వర్గం కానీ తన సొంతం కోసం కాకుండా ప్రజా ప్రయోజనాన్ని ఆశించి కోర్టులో దాఖలు చేసే వ్యాజ్యాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం *PIL(పిల్)* అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో Public& Interest Litigation అంటారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత ద్వారా న్యాయస్థానాలు ప్రజలకు ఇచ్చిన అధికారమే ప్రజా ప్రయోజన వ్యాజ్యం.
*ఎందుకోసం?*
ప్రజాప్రయోజన వ్యాజ్యమనేది న్యాయం పొందడం కోసం న్యాయస్థానాలు ప్రజలకు అందజేసిన ఓ ఆయుధం వంటింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన తర్వాత కోర్టులు జారీ చేసే ఆదేశాలతో బాధితులకు న్యాయం కలగడమే కాకుండా అనేక సందర్భాల్లో రక్షణ చర్యలు, బాధితు ప్రయోజనాల కోసం విధివిధానాలు రూపొందించడం వంటి మేలు కూడా జరిగింది
*ఎప్పుడు దాఖలు చేయవచ్చు?*
●సమస్యపై పోరాడేందుకు బాధితుడి వద్ద అవసరమైన వనరులు లేనప్పుడు లేదా ఆ వ్యక్తి న్యాయస్థానానికి వెళ్లే స్వేచ్ఛను హరించినపుడు లేదా అన్యాయంగా అడ్డుకున్నప్పుడు ఇటువంటి వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చు.
●అన్యాయం జరిగిన విషయం న్యాయస్థానం దృష్టికి వచ్చినట్లయితే... న్యాయస్థానమే స్వయంగా విచారణ చేపట్టవచ్చు. లేదా ప్రజాప్రయోజనాల కోసం కృషి చేసే వారెవరైనా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించడం చేయవచ్చు.
●సాయం కోరుతున్న వ్యక్తి స్వప్రయోజనాల కోసమో లేదా దురుద్దేశాలతోనో కాకుండా ప్రజల ఇబ్బందులకు పరిష్కారం పొందేందుకు విశ్వసనీయంగా ప్రవర్తిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా కోర్టు సరిచూసుకుంటుంది. ఆ తర్వాతే విచారణకు స్వీకరిస్తుంది.
*లేఖ కూడా వ్యాజ్యమే...*
ప్రజలకు నష్టం కలిగిస్తున్న సమస్య తీవ్రతను, పర్యవసానాలను వివరిస్తూ ఎవరైనా న్యాయస్థానానికి లేఖ రాసినప్పుడు... ఆ లేఖపై సైతం కోర్టు స్పందించవచ్చు. ఆ లేఖ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వంటిదేనని కోర్టు భావించాల్సి ఉంటుంది. అటువంటి లేఖలను న్యాయస్థానాన్ని ఉద్దేశించి రాయాలే తప్ప ఏ న్యాయమూర్తిని ఉద్దేశించి రాయకూడదు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించిన మొట్టమొదటి న్యాయమూర్తులు *జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్* .
EmoticonEmoticon