*శ్రీకృష్ణతత్వం*
ధర్మరాజు " భీష్మపితామహా ! నాకు శ్రీకృష్ణతత్వము గురించి తెలుసుకోవాలని ఉంది " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నారదాది మునుల వలన నేను తెలుసుకొన్నది ఇప్పుడు నీకు చెప్తాను. శ్రీకృష్ణుడే పరమాత్మ అయిన విష్ణుమూర్తి. అతడు తన వినోదము కొరకు భూమి, ఆకాశము, నీరు, వాయువు అను పంచ భూతములను కల్పించాడు. అలా కల్పించిన జలములో ఒక భవ్యమైన తల్పము మీద అతడు శయనించి ఉన్నాడు. అతడి నాభినుండి ఒక కమలము ఉద్భవించింది. ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ తన సంకల్పంచేత ఏడుగురు మానస పుత్రులను సృష్టించాడు. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యపప్రజాపతి జన్మించాడు. కశ్యపుడి వలన దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జన్మించారు. ఆ కశ్యప ప్రజాపతి పుత్రుడు సూర్యుడు. అత్రి మహామునికి చంద్రుడు జన్మించాడు. ఈ సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు అనేక సంవత్సరాలు రాజులై ఈ భూమిని పాలించారు. దేశ కాల పరిస్థితులను అనుసరించి రాజవంశస్థులు శాఖోపశాఖలై వర్ధిల్లాయి. ఆ రాజ వంశీయులు తమలో తాము కలహించుకుని విభేదించి యుద్ధములు చేసుకున్నారు. ఆ యుద్ధముల కారణంగా విష్ణువు జనక్షయం చేస్తూ వచ్చాడు. ఆ దేవదేవుడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దుడు అనే నాలుగు దివ్యరూపములతో దివ్యనామలతో వినోదించాడు " అని చెప్పి భీష్ముడు శ్రీకృష్ణుడిని చూపి " ధర్మనందనా ! ఈ మహాపురుషుడిని సామాన్య మానవుడిగా చూడటము మన అజ్ఞానము. శ్రీకృష్ణుడు భక్త పరాధీనుడు, తన కటాక్షవీక్షణాలతో భక్తుల కోరికలను తీరుస్తుంటాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించాడు.
EmoticonEmoticon