గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (సెప్టెంబర్ 14, 1883 - ఫిబ్రవరి 29, 1960)

 ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (సెప్టెంబర్ 14, 1883 - ఫిబ్రవరి 29, 1960) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.....ఆయన  జీవితం గురించి సంక్షిప్తం గా....


గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయోద్యమకారునిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, వయోజన విద్య పితామహునిగా, రచయితగా ప్రసిద్ధులు. ఈయన 1883, సెప్టెంబర్‌ 14 వ తేదీన వెంకటరావు, భాగీరధీబాయి దంపతులకు కర్నూల్‌లో జన్మించారు. చిన్నతనంలో ఈయన అక్షరాభ్యాసం కంభం తాలూకా రావిపాడు లో జరిగింది. కొంతకాలం కర్నూలు మున్సిపల్‌ బడిలో చదివారు. బి.ఏ. క్లాసులో కూడా మూడు భాగాలూ ఒకేసారి ఉత్తీర్ణులై కళాశాలకే ప్రథమంగా నిలిచారు. అంతేకాదు అప్పట్లో ఎం.ఏ. పట్టా పొందిన ఆంధ్రుల్లో ఈయనే ద్వితీయులని చెబుతారు.

1906లో లక్ష్మణరావు ప్రధాన సంపాదకులుగా 'విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి' స్థాపించారు. దీనికి హరిసర్వోత్తమరావు, కాళేశ్వరరావు కార్యదర్శులుగా ఉండేవారు. దేవర్సు రచించిన 'అబ్రహం లింకన్‌ చరిత్ర'ను హరిసర్వోత్తమరావు తెలుగులో రాశారు. ఇది ఈ గ్రంథమండలి ప్రచురించిన తొలి పుస్తకం. అందులో 'అచ్చుయంత్రాల' వ్యాసం చాలా విపులమైంది. ఈయన 'ఢిల్లీ దర్బారు' గ్రంథాన్ని కూడా రచించారు. ఈ గ్రంథమండలి ఆంధ్ర దేశంలో సారస్వతరీత్యా విజ్ఞాన వ్యాప్తికి చాలా దోహదపడింది.

1907లో రాజమహేంద్రవరంలోని ఉపాధ్యాయ కళాశాలలో చదువుకొంటుం డగా, బిపిన్‌ చంద్ర పాల్‌ ఉపన్యాసాలతో స్ఫూర్తి చెంది 'వందేమాతరం' ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆయనను కళాశాల నుండి బహిష్కరించారు. శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగానికీ అనర్హులయ్యారు.

స్వరాజ్య భావాలను ప్రచారం చేసేందుకు గాను, ఆనాటి దేశ భక్తులు అనేక పత్రికలు స్థాపించారు. అందులో భాగంగానే హరిసర్వోత్తమ రావు బెజవాడ వచ్చి కాశీనాథుని వీరమల్లయ్యతో సంప్రదించి ఒక ముద్రణాలయాన్ని తీసుకున్నారు. ఆ తరువాత బోడి నారాయణరావు, పింగళి లక్ష్మీనారాయణలతో కలిసి 'స్వరాజ్య' తెలుగు పత్రికను నడిపారు. దీనికి ఆయనే ప్రధాన సంపాదకులుగా వ్యవహరిం చారు.

రాయలసీమలోని 4 జిల్లాల పాడి పంటలకు కావలసిన నీటి వనరుల విషయమై చాలా శ్రద్ధ తీసుకున్నట్లు రావు కృషి పరికిస్తే తెలుస్తుంది. 'దత్త మండలాల ఇరిగేషన్‌ ప్రాజక్టుల కమిటీ' ఏర్పరిచి దానికి కడప కోటిరెడ్డి గారితో జాయింట్‌ కార్యదర్శిగా ఉండి మరీ పని జరిపించారు.

ఆంగ్ల పదం 'ఎడిటర్‌' కు తెలుగులో 'సంపాదకుడు' అని నామకరణం చేశారు. ప్రథమ ఆంధ్ర దినపత్రిక 'ఆంధ్ర పత్రిక' కు, 1914-17 మధ్య కాలంలో, తొలి సంపాదకులుగా ఉన్న నాటి నుండి రావు జీవితం పత్రికా వ్యాసాంగంలో గడిచింది. ఆంగ్లం, ఆంధ్ర భాషల్లో అనేక వ్యాసాలు రాశారు. చదువులు అంతగా లేని ఆ రోజుల్లో విలేకరులు దొరకటమే కష్టమయ్యేది. ఇక సంపాదకుల విషయం చెప్పనవసరం లేదు. అలాంటి సందర్భాలలో ఈయన అనేక పత్రికలకు సంపాదకత్వం వహించారు! పత్రికా రచయితగా, పాక్షికత్వానికి దూరంగా ఉంటూ, వాస్తవాన్ని ప్రపంచానికి తెలియచేసేందుకు జంకకూడదనేవారు. పత్రికా రచన ఏ ఒక వ్యక్తి కోసమో, లేక కొందరి స్వార్థం కోసమో కాక సమాజ శ్రేయస్సు కోసం, జాతి అభ్యుదయం కోసం ఉపయోగించినపుడే పత్రిక రచన సార్థకం కాగలదనేవారు. జీవితాంతం పత్రికా రచయితగా, దానికొక విశిష్టత చేకూర్చిన ధన్యజీవి గాడిచెర్ల, 1939 లో ఆంధ్ర రాష్ట్ర జర్నలిస్ట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షులుగానూ ఉన్నారు.


ప్రజలకు చదువు చాలా అవసరమని బలంగా నమ్మిన హరిసర్వోత్తమరావు ఆంధ్రదేశంలో ఎన్నో వయోజన విద్యా కేంద్రాలను నెలకొల్పారు. 1934లో రైతు సంఘాన్ని స్థాపించి రైతుల స్థితిగతులు మెరుగుపర్చడానికి నిర్విరామ కృషి చేశారు. అస్పృశ్యతను రూపుమాపడానికి తన ఇంట్లోనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం తెలుగు మాసపత్రిక 'సౌందర్యవల్లి'ని నడిపారు. గ్రంథాలయోద్యమానికి ఆయన చేసిన కృషి వర్ణించలేనిది. అందుకే ఆయన జ్ఞాపకార్థం కర్నూలు జిల్లా గ్రంథాలయానికి 'గాడిచర్ల హరిసర్వోత్తమ రావు భవనం' పేరు పెట్టారు. గ్రంథాలయ ప్రాంగణంలో గాడిచర్ల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. 20 వ శతాబ్దంలో కర్నూలు జిల్లా రాజకీయ, సామాజిక, సాంఘిక, సంస్కరణ మొదలైన రంగాలను ప్రభావితం చేసిన కొద్ది మందిలో గాడిచర్ల ఒకరు.

జీవితాంతం వివిధ రంగాలకు కృషి చేసిన హరిసర్వోత్తమరావు 1960 ఫిబ్రవరి 29న తుది శ్వాస విడిచారు. ఆయన ఆ రోజులలో నాటిన గ్రంథాలయాల మొక్కలు పెరిగి, పెద్దవై , మహావృక్షాలై నేటి సమాజానికి, సామాజిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.




no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv