*ఆన్‌లైన్ మోసాల జోరు*
*ప్రస్తుతం మారిన టెక్నాలజీతో పాటు మోసగాళ్లూ తమ పంథాను మార్చుకుంటున్నారు.* అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ కొత్త రకం జాబ్‌ఫ్రాడ్స్‌కు తెరతీశారు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని, కొత్త పంథాలో రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. అందుకోసం వారు ఉపయోగిస్తున్న టెక్నాలజీ పేరు ఆన్‌లైన్. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, కేవలం మీ రెజ్యూమ్‌ను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే చాలని చెప్పే ఎన్నో రకాల జాబ్ పోర్టల్స్‌ను సృష్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా వివిధ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేసిన రెజ్యూమ్స్ ఆధారంగా నిరుద్యోగులకు ఫోన్‌చేసి, రకరకాల ఉద్యోగాలున్నాయని నమ్మిస్తున్నారు. అందుకోసం అవసరమయ్యే ఖర్చుల నిమిత్తం ఫీజులను అకౌంట్లో జమచేయించుకొని తమ ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నారు. ఇలా ఓ మారుమూల ప్రాంతంలో గదిలో కూర్చొని సైబర్ నేరగాళ్లు.. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగులను ఆకర్షిస్తున్నారు. దేశవిదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, బురిడీ కొట్టించి, ఆన్‌లైన్‌లో, ఫోన్‌లో నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఫేక్ ఐడీకార్డులు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, నకిలీ వీసాలు ఇచ్చి విదేశాలకు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ముక్కు ముఖం తెలియకుండానే కేటుగాళ్ల మాటలో చిక్కుకున్న లక్షలాది మంది నిరుదోగులు లక్షల రూపాయలు పోగొట్టుకొంటున్నారు. ఇలా రోజుకో కొత్తరకం ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్న సంస్థలు, జాబ్ కన్సల్టెన్సీలు, జాబ్‌పోర్టల్స్, ఆన్‌లైన్ ఉద్యోగాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు, దళారీలు ఇప్పిస్తామని చెప్పే బ్యాక్‌డోర్ ఉద్యోగాలు, ఇలాంటి అనేక రకాల జాబ్ ఫ్రాడ్స్ పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక్కసారి మోసగాళ్ల వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి రావనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలన్నారు.
*కన్నింగ్ కన్సల్టెన్సీలు*
కాలం మారుతున్నా కొద్దీ మోసగాళ్లు సైతం తమ పంథాను మార్చారు. నగరంలో చిన్నచిన్న గదులను అద్దెకు తీసుకొని ఏదో ఒక పేరుతో జాబ్ కన్సల్టెన్సీలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్న ఉద్యోగాలతో పాటు, ఎంఎన్‌సీ కంపెనీల్లో కాల్ సెంటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, పదోతరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్న ఎవరికైనా మా వద్ద ఉద్యోగం గ్యారంటీ అని పేపర్లో ప్రకటనలు ఇస్తారు. ప్రకటన చూసి వారిని సంప్రదించిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అక్కడి వాతావరణం, మనుషులు ఎంతో పలుకుబడి ఉన్నవాళ్లలా ప్రవర్తిస్తారు. అనంతరం ఉద్యోగ హామీ ఇస్తారు. ఆ తర్వాత వివిధ రకాల ఫీజుల కింద రూ.రెండు నుంచి రూ.5 వేల వరకు లాగేస్తారు. జాబ్ వచ్చిన తర్వాత మరో రూ.5 వేలు ఇవ్వాలంటారు. రేపు మాపు అంటూ కొద్ది రోజులు కాలం గడుపుతారు. ఆ తర్వాత బిచాణా ఎత్తేస్తున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు తాము పోగొట్టుకున్నది తక్కువ మొత్తంలోనే కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మకికొన్ని కన్సల్టెన్సీలు మాత్రం నగరంలో ఏదో ఒక మారుమూల కంపెనీలో చిన్న ఉద్యోగాలు చూపిస్తారు. అక్కడకు వెళ్లిన వారికి ఉద్యోగం చేసే పరిస్థితిలేని వాతావరణాన్ని సృష్టిస్తారు. వాళ్లంతట వాళ్లే ఉద్యోగం వదిలేసేలా పథకం వేస్తున్నారు. ఇలా అనేక మంది చిన్న ఉద్యోగాల కోసం వచ్చిన వారిని మోసం చేసి నెలకు లక్షలు కొల్లగొడుతున్నారు.
EmoticonEmoticon